విజయ లక్ష్మి ధీరుడిదే
ఒక చెరువు గట్టు పై మూడు కప్పలు
కూర్చుని ఉన్నాయి.
అందులో రెండు కప్పలు కూర్చోవడం పై విసుగెత్తి చెరువులోకి దూకాలని
నిర్ణయించుకున్నాయి.
ఇప్పుడు గట్టుపై ఎన్ని కప్పలు
ఉంటాయి?
మీరు చెప్పే సమాధానం "ఒకటే
ఉంటుంది అని"ఐతే కనుక మొదటి నుంచి
మళ్ళీ ఒకసారి చదవండి.
మిత్రులారా! జీవితంలో కూడా అంతే.
మనం ఎంత గొప్ప నిర్ణయం తీసుకున్నాము
అనేదానికన్నా మన నిర్ణయాన్ని మనం ఎంత వరకూ అమలు పరుస్తున్నాం అనేదానిమీదే మన జీవితంలో
మార్పు కానీ, అభివృధ్ధి కానీ ఆధారపడి ఉంటుంది.
గొప్ప గొప్ప ఆలోచనలు అందరూ చేయగలరు,
కానీ వాటిని కొంతమంది మాత్రమే అమలు చేయగలరు.
వారినే అచ్చ తెలుగులో ధీరుడు
అంటారు.
చాలా కాలం క్రితం నేను మా గురువు
గారి క్లాసులో మొదటి సారి కూర్చున్నప్పుడు,చాలా విషయాలు చెబుతూ మధ్యలో ఆయన సడెన్ గా జేబు లోంచి ఒక 500 నోటు తీసారు. దాన్ని
పైకి పట్టుకుని, ఇది ఇక్కడ ఉన్న వారిలో ఒకరికి ఇద్దామనుకుంటున్నాను,
ఎవరికి
కావాలి? అన్నారు.
కూర్చుని ఉన్నవారిలో ( నాతో
సహా) రకరకాల ఆలోచనలు....
అసలు ఇస్తాడా? లేకపోతే సరదాగా
జోక్ చేస్తున్నాడా?
అసలు అలా ఎవరైనా ఇస్తారా?
ఒక వేళ నిజంగా ఐతే, నాకే ఇస్తే
బాగుణ్ణు.
డబ్బులు ఎవరూ ఫ్రీగా ఇవ్వరు,
దానికి బదులుగా ఏం చేయమంటాడో?
మనమే తీసుకుందామా? ఎవరైనా తీసుకుంటారేమో
చూద్దామా?
ఇలా రకరకాల ఆలోచనలతో మేము ఉండగానే
ఆయన రెండోసారి అడిగారు.
మెల్లిగా ఒక్కొక్కళ్ళము చేతులు
లేపి "నాకు కావాలి, నాకు కావాలి" అనసాగాము.
ఈ లోగా ఆయన మళ్ళీ మూడో సారి
అడిగారు. ఒక పక్కన అన్ని సార్లు ఎందుకు అడుగుతున్నాడో అని ఆలోచిస్తూనే " నాకు
కావాలి,నాకు కావాలి" అని ఇంకా గట్టిగా అరుస్తున్నాము. ఈ లోగా మాలో ఒక అతను కుర్చీ
లోంచి లేచి స్టేజ్ మీదకి వెళ్ళి ఆయన దగ్గరగా నిల్చుని చేతి లోంచి తీసుకున్నాడు.
మేము అందరం ట్రైనర్ తనని కోప్పడతాడు
అనుకున్నాము.
కాని ఆయన నవ్వి " ఇదే జీవితం"
అన్నారు.
మాకు అర్ధం కాక అలాగే చూస్తున్నాము.
"జాగ్రత్తగా ఆలోచించండి!
ఈ నోట్ నేను ఇతని కోసం ప్రత్యేకంగా రిజర్వ్ చేయలేదు అవునా? ఇక్కడ ఉన్న మీ అందరికీ ఆ
నోట్ కావాలని ఉంది.కాని మీరు అందరూ అక్కడే ఉండి కావాలి,కావాలీ అని అరుస్తున్నారే కాని,
కావలసిన దాని దిశగా కనీసం ఒక్క అడుగైనా వేసారా? కోరిక మీ అందరికీ ఉంది,దాని దిశగా కృషి
ఇతను చేసాడు.
చాలా సార్లు జీవితంలో మనకు కావలసింది
సాధించడం మనము అనుకున్నంత కష్టమేం కాదు.దాని దిశగా మొదటి అడుగు వేయడమే కష్టం.
మీరు ఈ నోట్ ఎలా పొందాలా అని
ఆలోచించడం మాని వేసి నిజంగా ఇస్తాడా?, ఇవ్వడా? అని మీలో మీరే డిసైడ్ అయిపోయి మీనం,
మేషం అంటూ ముహూర్తం చూసుకుంటూ ఉండి పోయారు.
అవకాశం మీ దాకా రావాలని దేవుణ్ణి
కోరుకుంటూ ఉన్నారే కాని, కనబడిన అవకాశం దిశగా మీరు కదలలేదు.
గుర్తుంచుకోండి. దేవుడైనా అవకాశం
మాత్రమే ఇస్తాడు కాని తెచ్చి మీ చేతిలో పెట్టడు.
జీవితంలో నీకు కావలసిన విజయాలు
నీ చర్యల వల్లనే వస్తుంది తప్ప నువ్వు ఎంత ప్రార్ధన చేస్తున్నావు, ఎంత గొప్ప భక్తుడివి,
నీకు ఎంత అత్యవసరంగా కావాలి అనే విషయాలతో రాదు.
ప్రతి విషయానికి భయపడుతూ ,ఓవర్
గా ఆలోచిస్తూ, అనుమానిస్తూ ఉంటే జీవితంలో ఎప్పటికీ కావలసినది సాధించలేం.
డబ్బు విషయంలో ఇది మరీ పర్ఫెక్ట్
గా పాటించాల్సి ఉంటుంది.
అలా తన భయాల, అనుమానాల, సౌకర్యాల
వలయాన్ని దాటాలంటే ధైర్యం కావాలి.
అలా ధైర్యం చేయగలిగినవాడే ధీరుడు.
విజయ
లక్ష్మి అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడూ ధీరుడిదే.
Comments
Post a Comment